తెలంగాణవీణ , జాతీయం : అయోధ్య రామమందిరానికి విరాళాల పేరిట కొందరు మోసాలను తెగబడుతున్నారంటూ విశ్వహిందూ పరిషత్ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. విరాళాల సేకరణకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ (ట్రస్ట్) ఎవరినీ అనుమతించలేదని స్పష్టం చేసింది. ఈ ఉదంతంపై హోం మంత్రిత్వ శాఖతో పాటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. ‘‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరిట ఫేక్ యూపీఐ ఐడీలతో కొందరు డబ్బులు దండుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది’’ అని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. విరాళాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభిషేక్ కుమార్ అనే వ్యక్తి ఫేక్ యూపీఐ ఐడీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్టు వీహెచ్‌పీ వెల్లడించింది.