తెలంగాణ వీణ,ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం సంక్రాంతి పండుగను కన్నుల పండువగా నిర్వహించారు. నగరమేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, కార్పొరేటర్లు అధికారులు సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్నారు.
కార్యాలయ ఆవరణలో గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కల వాళ్లు వాయిద్యాలను వాయిస్తూ సందడి చేశారు. మెప్మా సిబ్బంది పాయసం, అరిసెలు, సున్నుండలు ఇతర పిండి వంటకాలను తయారు చేసే ప్రదర్శించారు.
కార్యాలయ సిబ్బంది ఏర్పాటుచేసిన బొమ్మల కొలువు అందర్నీ ఆకర్షించింది.
కార్యాలయ ఆవరణ మొత్తాన్ని ఉద్యోగులు రంగవల్లులతో నింపేశారు. చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. ‘ఐ లవ్ ఏలూరు’ వాటర్ ఫౌంటెన్ ను మేయర్ షేక్ నూర్జహాన్ బేగం ప్రారంభించారు. తొలుత కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సంక్రాంతి లక్ష్మికి మేయర్ దంపతులు పూజలు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను నగర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. అందరి ఇల్లు సిరి సంపదలతో
తుల తూగాలని ఆకాంక్షించారు. నగర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ
నగర ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు. ఏలూరును సుందర నగరంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, గుడిదేశి. శ్రీనివాస్, అదనపు కమిషనర్ బాపిరాజు, డిప్యూటీ కమిషనర్ రాధ, కార్పొరేటర్లు, వివిధ సెక్షన్ల అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు.