తెలంగాణ వీణ, ఉప్పల్ : ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల నిధులను కేటాయించ నున్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి అభివృద్ధి పనులకు ఈ నిధులను సద్వినియోగం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గాల ఇంఛార్జీలు సమస్యలను గుర్తించే పనుల్లో నిమగ్నం కావాలని సూచించారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జీలతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గానికి రూ. 10 కోట్ల నిధులను కేటాయించి కావాల్సిన అభివృద్ధి పనులను చేపట్టనున్నట్టుగా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతోపాటు మిగతా నియోజక వర్గాలలోనూ నియోజకవర్గం యూనిట్‌గా రూ.10 కోట్ల చొప్పున అభివృద్ధి పనులకు నిధులను కేటాయించ నున్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నిధులను సరైన పద్దతిలో ఖర్చు చేసే విషయంలో పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీలదే కీలక పాత్రగా సూచించారు. అందుకు ఇంఛార్జీలు అభివృద్ధి పనులను చేపట్టే ప్రాంతాలనుగుర్తించాలన్నారుపార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు అండగా నిలుస్తామన్నారు. ఏ ఒకరు కూడా అధైర్య పడొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, కావాల్సిన నిధులు, పనులను చేసుకొనే అవకాశం ఉందన్నారు.
కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం ఇంఛార్జీ మందముల పరమేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.