తెలంగాణవీణ, జాతీయం: అయోధ్య రామమందిరంలో కొలువుతీరనున్న రాముడి విగ్రహంపై క్లారిటీ వచ్చింది. మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్లు టెంపుల్ ట్రస్ట్ ప్రకటించింది. ఈమేరకు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రాణప్రతిష్ఠ కోసం ముగ్గురు శిల్పులతో మూడు వేర్వేరు విగ్రహాలను సిద్ధం చేయించామని, అందులో అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని ఎంపిక చేశామని వివరించారు. ఈ శిలా విగ్రహం 150 నుంచి 200 కిలోల బరువు ఉంటుందని చంపత్ రాయ్ తెలిపారు. సీతారాములు చెయ్యెత్తి ఆశీర్వదిస్తుండగా, పక్కనే లక్ష్మణుడు చేతులు కట్టుకుని నిలుచున్న భంగిమలో, రాముడి పాదాల చెంత కూర్చుని హనుమాన్ భక్తితో నమస్కరిస్తున్నట్లు అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. గర్భగుడిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని వివరించారు. అదే సమయంలో గడిచిన 70 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న బాల రాముడి విగ్రహాన్ని కూడా భక్తులు సందర్శించుకునేలా ఆలయంలో ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
జనవరి 17: రామ్ లల్లా విగ్రహం ర్యాలీగా అయోధ్యకు చేరుకుంటుంది. సరయూ నది నీటితో నిండిన మంగళ కళశాన్ని భక్తులు ఆలయానికి చేరుస్తారు.
జనవరి 18: ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన పూజలకు శ్రీకారం చుడుతూ గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాత్రికా పూజ, బ్రాహ్మిణ్ వరణ్, వాస్తు పూజలు నిర్వహిస్తారు.
జనవరి 19: నవగ్రహ పూజ నిర్వహించి, హోమం ప్రారంభిస్తారు.
జనవరి 20: వాస్తు శాంతి తర్వాత సరయూ నది నీటితో ఆలయాన్ని శుద్ధి చేస్తారు.
జనవరి 21: రాముడి విగ్రహానికి జలాభిషేకం, గర్భగుడిలో ఏర్పాటు.
జనవరి 22: మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రాణప్రతిష్ఠ పూజ.