- ఎస్పీ రోహిత్ రాజుకు కామేష్ పిర్యాదు
- నూతనంగా భాద్యతలు స్వీకరించిన ఎస్పీకి సన్మానం
తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో నిబంధనలు విరుద్ధంగా మద్యం సిండికేట్ వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్ కోరారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ గా భాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజ్ కు అభినందనలు తెలిపి నిబంధనలకు విరుద్ధంగా మద్యం సిండికేట్ వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లిఖతపూర్వకంగా పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం పాల్వంచ రామవరం సుజాతనగర్ ప్రాంతాలలో ఎక్సైజ్ అధికారులరాజకీయ నాయకుల అండదండలతో మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి స్టాక్ పాయింట్లను ఇష్టారీతిన ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి అధిక ధరలకు మద్యం సరఫరా చేస్తున్నారని సదరు స్టాక్ పాయింట్ల నుండి బెల్ట్ షాప్ లకు మద్యం సరఫరా చేయడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో తరచూ గొడవలు జరిగి లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వారిని గుర్తించి వారి లైసెన్స్ రద్దు చేసి సదరు వ్యక్తులపై పిడి యాక్ట్ నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగుల రవికుమార్, అసెంబ్లీ అధ్యక్షుడు చేనిగరపు నిరంజన్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.
