- భార్య పార్వతీ దేవి, పిల్లలు కుమార స్వామి, వినాయకుడి పేర్లు కూడా..
- ప్రజాపాలన చివరి రోజు దేవుడి పేరుతో దరఖాస్తు
- భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఘటన.. రశీదు ఇచ్చిన అధికారులు
తెలంగాణవీణ, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి స్వయంగా పరమ శివుడే వచ్చేశాడు. సామాన్యులతో పాటు సాక్షాత్తూ శివుడు కూడా ఇందిరమ్మ ఇల్లు, గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తు స్వీకరించిన అధికారులు.. పరిశీలించి ఆయా పథకాలు మంజూరు చేస్తామంటూ రశీదు కూడా ఇచ్చారు. శివయ్య పేరుతో అభయ హస్తం దరఖాస్తు ఫారం ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేంటి.. దేవుడు దరఖాస్తు చేసుకోవడమేంటని ఆశ్చర్యంగా ఉందా.. నిజంగానే దరఖాస్తు వచ్చింది. భీమదేవరపల్లి మండలం ముత్తారంలో చోటుచేసుకుందీ వింత. ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి ఈ దరఖాస్తును అధికారులకు అందజేశాడు. కుటుంబ యజమాని కాలమ్ లో శివయ్య పేరును, కుటుంబ సభ్యుల వివరాల కాలమ్ లో భార్య పార్వతీ దేవి, కుమారులు వినాయకుడు, కుమార స్వామి పేర్లను రాశాడు. కుమార స్వామి వయస్సును 1200 సంవత్సరాలుగా పేర్కొన్నాడు.