ఇందిరమ్మ రాజ్య స్ధాపనలో తొలి అడుగు
తెలంగాణవీణ,హైదరాబాద్ : తెలంగాణలో ప్రజా పాలన నెల రోజులు పూర్తి చేసుకుంది.
ఈ నెల రోజుల్లోనే అనేక కొత్త మార్పులకు నాంది పలికింది.
ప్రజలకిచ్చిన హామీల సత్వర అమలుకు చర్యలు చేపడుతూనే,
ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగం, ఫెడరలిజం స్పూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సందాలు కొనసాగించడానికి సంకల్పించింది.
పారదర్శక, జవాబుదారి పాలన సాగించేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తుంది.
గత పదేళ్ల నియంతృత్వ పాలనకు భిన్నంగా ప్రజా పాలన లక్ష్యంగా అడుగులు వేస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది.
మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తెచ్చింది.
ఆరోగ్య శ్రీ బీమాను పది లక్షలకు పెంచింది. మిగిలిన హామీల అమలుకు ప్రజా పాలనలో అర్హులైన వారి నుండి అర్జీలను స్వీకరించింది.
దాదాపు కోటికి పైగా వచ్చిన అర్జీలను క్రోడీకరించుకొని అర్హులకు ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. వంద రోజుల్లోనే హామీలను అమలు జరుపుతామని ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ఆర్దిక వనరులను సమకూర్చుకుంటుంది.
ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నాల్గవ తేదీలోగానే వేతనాలు చెల్లించింది. రైతుల రుణ మాపీ కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తుంది.
అర్దిక వనరులను సమీకరించుకొని ఇప్పటికే 25 శాతం మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను జమ చేసింది. వచ్చే వారం రోజుల్లో రైతులందరి ఖాతాల్లో డబ్బు జమ చేయబోతుంది.
రైతు భరోసా సాయం
సాగు భూములకే వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తుంది.
నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా దృష్టి కేంద్రకరించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసింది.
వచ్చే నెలాఖరులోగా 22 వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటుగా డిసెంబర్ లోగా 2 లక్షల ఉద్యోగాలు బర్తీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.పని, ప్రవర్తన, సుపరిపాలన తమ లక్ష్యం అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రజలకు హమీ ఇచ్చింది.
అందులో భాగంగా ప్రజల సమస్యలపై దృష్టి కేంద్రీకరించింది. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్దిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. వనరులు పెంచుకొనేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి ఆర్దిక కార్యకలాపాలు పెంచడానికి సంకల్పించింది. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడానికి ఢిల్లీ పర్యటనలు కొనసాగిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగ పర్చుకోవడం ద్వారా అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను అర్హులకు అందించే ప్రయత్నం చేస్తుంది.
ఇక పోతే, నామినేటెడ్ పదవుల భర్తీ పై కూడా ముఖ్యమంత్రి దృష్టి కేంద్రీకరించారు. పార్టీ కోసం పని చేసిన వారిని నామినేటెడ్ పడవుల్లో నియమించడం ద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం కోసం కార్యాచరణ అమలు జరిపేందుకు నిర్ధిష్ట ఆలోచనలు చేస్తున్నారు.పరిపాలన పై పట్టు కోసం కొత్త ప్రభుత్వం పాలనా వ్యవస్ధను సమూలంగా మార్చి వేసింది. సమర్ధులనుకునే అధికారులకు కీలకమైన బాధ్యతలు అప్పగించింది.
ప్రజా పాలన స్పూర్తితో పని చేయాలని సూచించింది. నియంతృత్వ పోకడలకు స్ధానం లేదని, ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు క్షేత్ర పర్యటనలు చేయాలని ఆదేశించింది. మంత్రులు కూడా క్షేత్ర పర్యటనలు చేయడంతో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలని భావించి కార్యాచరణ అమలు జరుపుతోంది. గడీలకే పరిమితమైన పాలనను ప్రజల మధ్యకు తీసుకెళ్లడానికి ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం వెల్లి విరియాలనే పాలకుల ఆకాంక్షలు నెరవేరే విధంగా అధికార యంత్రాంగం పని చేయాలని కోరింది.
తాము పాలకులం కాదని, సేవకులం అని భావించి, పేదల అభ్యున్నతి, రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా విధులు నిర్వర్తించవలసి ఉంటుందని పేర్కొంది.నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గత పదేళ్ల కేసీఆర్ పాలనతో ఆ దిశగా అడుగులు వేయలేదని ప్రజా పాలన ప్రభుత్వం గుర్తించింది. గత ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటుంది.
అవినీతిని కక్కించేందుకు వివిధ అంశాలపై న్యాయ విచారణకు సిద్దపడింది.
ఆర్ధిక వ్యవస్ధను అస్తవ్యస్తం చేయడం వల్ల రోజు వారి పాలన కూడా గడపలేని పరిస్ధితిని కల్పించిన గత పాలకుల చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూనే ఇక మీదట పారదర్శకంగా పరిపాలన సాగించబోతుంది.
సాగునీటి రంగంలో ప్రాధాన్యతలను గుర్తించడం, నిధులను సమీకరించుకోవడం, నియామకాల్లో వేగం పెంచడం కోసం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది.
గత నెల రోజుల రేవంత్ రెడ్డి పాలన ప్రజల ఆదరణ చూరగొంది.
సుపరిపాలనకు నాంది పలికింది.
పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తుంది. ఇక మీదట కూడా ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది.
అన్ని రంగాల్లో మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు నిరంతరం సమీక్షలు కొనసాగిస్తుంది.
ప్రజా సమస్యలను సాధ్యమైనంత మేరకు పరిష్కరించడానికి అధికారులు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన పక్షంలో ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పాలనకు తిరుగుండదనే భావన కలిగిస్తుంది.
తెలంగాణలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడిన ప్రజలు
ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నారని,
ఆ దిశగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందనే సానుకూల ఆలోచనలకు బలం చేకూరుతోంది.
ప్రభుత్వం జిల్లాల విభజన పై కూడా దృష్టి కేంద్రీకరించింది.
కొత్త జిల్లాల ఏర్పాటు అస్తవ్యస్తంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు.
జిల్లాల విభజనపై కమిషన్ వేస్తామని అనడం సానుకూల పరిణామం.
ఇలాంటి వ్యవస్ధ సహేతుకం కాదని, పరిపాలనకు అనుగుణంగా జిల్లాలు, మండలాల ఏర్పాటు ఉండాలని ప్రభుత్వం భావించింది.
ఈ ఆలోచనతో ప్రస్తుతం ఉన్న జిల్లాల స్వరూపం మారబోతుంది.
పరిపాలనకు అనుగుణంగా కుదించడం, విస్తరించడం అత్యంత కీలకమని పరిపాలన నిపుణులు చేస్తున్న సూచనలు పరిగణలోకి తీసుకొని జిల్లాలను పునర్వవస్ధీకరించబోతున్నట్లు చేసిన ప్రకటనను ప్రజలు స్వాగతిస్తున్నారు. ఏ విధంగా చూసినా…
గత పదేళ్ల పాలనతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆదరాభిమానాలు పొందుతుంది.
సుపరిపాలన అందిస్తుందనే నమ్మకం కలిగిస్తుంది. హామీలను అమలు చేసి ప్రజల మద్దతు చూరగొంటుందనే నమ్మకం ఏర్పడుతుంది. ఒక ముఖ్యమంత్రి ఎలా వుండకూడదో కేసీఆర్ ను చూసి నేర్చుకున్నానని, ప్రజల్లో ఉంటూ నిత్యం వారికి అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్రాభివృద్దిని కాంక్షించేవారు స్వాగతిస్తున్నారు.
ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి పాలకులు కంకణబద్దులు కావడం హర్షనీయ పరిణామం.
కొలను వెంకటేశ్వర రెడ్డి.
ఎస్పీ జైళ్లు (రిటైర్డ్).
కన్వీనర్ తెలంగాణ యూనిఫాం సర్వీసెస్ జేఏసీ.