- కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
తెలంగాణ వీణ , భద్రాద్రి కొత్తగూడెం: ప్రజా అవసరాల కోసం చేపట్టిన పనులు జాప్యం చేయొద్దని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో రెవిన్యూ అటవి పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి ఇరిగేషన్ వ్యవసాయ మిషన్ బగీరథ విద్యుత్ మున్సిపల్ కమిషనర్లుతో సమన్వయ సమావేశం నిర్వహించి పెండింగ్ ఉన్న పనులను శాఖల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పన, గిరివికాసం బోర్లు తదితర పనులకు జిల్లా స్థాయి కమిటి ఆమోదించినట్లు చెప్పారు. అట్టి అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న పనులకు అంతరాయం కల్పించొద్దని అటవీ అధికారులకు సూచించారు. మంజూరు చేసిన పనులు చేపట్టే ముందు ఆయా శాఖల అధికారులు అటవీ అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని చెప్పారు. ఇరుశాఖల మధ్య సమన్వయం వల్ల పనులు సకాలంలో పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఏదేని సమస్య వస్తే తక్షణమే తన దృష్టికి తేవాలని పనులు పెండింగ్ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా పనులు జరగాలని చెప్పారు. పిసిసిఎఫ్ వద్ద పెండింగ్ ఉన్న అనుమతుల యొక్క నివేదికల వివరాలు అందచేయాలని చెప్పారు. జూలూరుపాడు లక్ష్మిదేవిపల్లి మండలాల్లో గిరివికాసం క్రింద మంజూరు చేసిన బోరుబావులకు విద్యుత్ సౌకర్యం కల్పించే పనులు తక్షణం చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. సబ్ స్టేషన్లు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన మండలాల్లో భూ కేటాయింపులు చేయాలని తహసిల్దారులను ఆదేశించారు. బోరుబావులు వేసేందుకు అటవీ అనుమతులు లేక మంచినీటి సమస్యతో భాదపడుతున్నట్లు గుర్తించిన గ్రామ పంచాయతీల్లో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మిషన్ బగీరథ అధికారులకు సూచించారు. మారుమూల గ్రామాల ప్రజలకు సెల్ఫోన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు టవర్లు నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించు విధంగా చర్యలు చేపట్టాలని ఆర్డీఓలకు సూచించారు.
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొరకు అవసరమైన అటవీ భూముల అనుమతులకు ప్రతిపాదనలు ఐటిడిఏకు పంపాలని చెప్పారు. అటవీ భూముల్లో పనులు చేపట్టేందుకు తప్పనిసరిగా జిల్లాస్థాయి కమిటిలో ఆమోదించాల్సి ఉంటుందని చెప్పారు. చేపట్టనున్న పనులకు సంబందించి అటవీశాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలన చేయాలని చెప్పారు. నూతన పనులు చేపట్టేందుకు జిల్లా స్థాయి కమిటి ఆమోదం కొరకు ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. పోడు పట్టాలున్న గిరిజన రైతులు పామాయిల్ సాగుకు బోరుబావులు, విద్యుత్ సౌకర్యం కల్పనకు అటవీ, వ్యవసాయ, రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి కిష్టాగౌడ్, అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు, మధుసూదన్ రాజు, ఆర్ అండ్ బి ఈఈ భీంలా, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, డిపిఓ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.