తెలంగాణవీణ,క్రీడలు : బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు కొత్త స్పాన్సర్ వచ్చినట్టు బీసీసీఐ వెల్లడించింది. దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ఐపీఎల్ కు ఐదేళ్ల పాటు స్పాన్సర్ గా వ్యవహరించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్ తో ఒప్పందం 2024 సీజన్ నుంచి 2028 సీజన్ వరకు వర్తిస్తుందని వివరించింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో లేనవిధంగా రూ.2,500 కోట్లతో స్పాన్సర్ షిప్ హక్కులను టాటా గ్రూప్ చేజిక్కించుకున్నట్టు బీసీసీఐ పేర్కొంది. టాటా గ్రూప్ గతంలోనూ ఐపీఎల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. 2022, 2023 సీజన్లకు టాటా గ్రూపే ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్. అంతేకాదు, ప్రపంచ క్రికెట్లో అతి పెద్ద మహిళల టీ20 లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కు టైటిల్ స్పాన్సర్ కూడా ఈ దేశీయ దిగ్గజ సంస్థే.