తెలంగాణవీణ, సినిమా : అన్నపూర్ణి’ సినిమా వివాదంపై నటి నయనతార క్షమాపణలు చెప్పారు. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు. తనకు, తన సినిమా బృందానికి ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలనే ఉద్దేశంలేదని వివరణ ఇచ్చారు. ‘ఓం’ చిహ్నం, ‘జై శ్రీరామ్’ నినాదంతో కూడిన క్షమాపణ లేఖను నయనతార షేర్ చేశారు. సానుకూల సందేశాన్ని అందించేందుకు తాము చేసిన ప్రయత్నం అనుకోని రీతిలో ఇతరులకు బాధ కలిగించి ఉండవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. సెన్సార్ అనుమతి పొంది గతంలో థియేటర్లలో ప్రదర్శించిన సినిమాని ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగిస్తారని తాము ఊహించలేదన్నారు. ఈ సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకున్నామని నయనతార అన్నారు. భగవంతుడిని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిని తానని, దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను తరచుగా సందర్శించే వ్యక్తిని తానని ప్రస్తావించారు. ‘అన్నపూర్ణి’ సినిమా ద్వారా ఎవరి మనోభావాలకైనా బాధ కలిగించివుంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని నయనతార అన్నారు.