- ప్రారంభమైన కళకళలాడని వైనం
- ఉన్న ఉపయోగం లేదంటూ అసహనం
- దుమ్ము ధూళితో దర్శనం
- పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం
తెలంగాణ వీణ , భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని కూలీ లైన్ ఏరియాలో ఉన్న మున్సిపల్ మార్కెట్ నిరుపయోగంగా దర్శనమిస్తుంది. వ్యాపారుల అవసరాల కోసం 33వ వార్డు పరిధిలో రైతు బజార్ ప్రాంతం వద్ద కొత్తగా మున్సిపల్ మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేశారు. అన్ని హంగులతో ముస్తాబైన మార్కెట్ యార్డును 27-09-2023లో అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించిన విషయం తెలిసిందే. పట్టణ ప్రగతి నిధుల కింద రూ.100 లక్షలతో మున్సిపల్ మార్కెట్ను నిర్మించి సిద్ధం చేసి ప్రారంభించినప్పటికీ ఉపయోగంలోకి రాకపోవడం విచారకరం. వ్యాపారస్తులతో కళకళలాడాల్సిన మార్కెట్ సముదాయం వెలవెల పోతున్న దారుణ పరిస్థితి నెలకొంది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన వ్యాపారస్తులకు ఉపయోగపడకపోవడం పట్ల చర్చనీయాంశంగా మారింది. దుమ్ము ధూళితో మార్కెట్ సముదాయం దర్శనమిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. మున్సిపల్ మార్కెట్ ను వినియోగంలోకి తీసుకురావడంలో మున్సిపల్ అధికారులు పాలకవర్గం విఫలమైనట్లుగా ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మున్సిపల్ మార్కెట్ వ్యాపారస్తులతో కలకలలాడే విధంగా చర్యలు తీసుకోవాలని కొందరు వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు.