తెలంగాణవీణ , హైదరాబాద్ : ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ఇచ్చిన గడువు వంద రోజులు కాలేదని ఆగుతున్నామని… లేదంటే చీల్చి చెండాడే వాళ్లమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్ నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ రేయింబవళ్లు కష్టపడిందని… కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తడబడిందని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గానికి ఒక్కరూపాయి తేలేనివాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రాలేమనే ఆలోచనతోనే ఇష్టారీతిన హామీలు ఇచ్చారని… అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను తయారు చేశారని చురక అంటించారు. మన వద్ద కాంగ్రెస్ నేతలు వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై చావు వార్త చెప్పే రోజులు మరెంతో దూరంలో లేవన్నారు.