తెలంగాణవీణ, హైదరాబాద్ : హైదరాబాద్‌కు అక్రమంగా దిగుమతి అయిన చైనా మాంజా ఓ ఆర్మీ అధికారి ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరుకు చెందిన కాగితాల కోటేశ్వర్‌రెడ్డి ఆర్మీలో నాయక్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం లంగర్‌హౌస్‌లో ఉన్న మిలటరీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య ప్రత్యూష, రెండేళ్ల కుమార్తెతో కలిసి బాపునగర్‌లో నివసిస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై బాపునగర్ నుంచి లంగర్‌హౌస్ వైపు వస్తున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో లంగర్‌హౌస్ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ఆయన మెడకు ఎగురుకుంటూ వచ్చి న పతంగికు కట్టిఉన్న చైనా మాంజా చుట్టుకుంది. ఆయన అప్రమత్తమయ్యేలోపే మాంజా గొంతుకు బిగుసుకుని కోసుకుపోయింది. దీంతో గొంతుపై తీవ్రగాయమై కోటేశ్వర్‌రెడ్డి వాహనంపైనుంచి కింద పడిపోయారు. రక్తం మడుగులో పడి ఉన్న ఆయన్ను గుర్తించిన స్థానికులు చికిత్స కోసం ఆయన పనిచేసే మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రెండు గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. కోటేశ్వర్‌రెడ్డి చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9.30 సమయంలో కన్నుమూశారు. కేసు నమోదు చేసుకున్న లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.