- జోరుగా కోడి పందేలు
- కోట్లల్లో వ్యాపారం
- నిబంధనలకు తూట్లు
- జాడ లేని పోలీసులు
తెలంగాణ వీణ , భద్రాద్రి కొత్తగూడెం: నిబంధనలతో సంబంధం లేదు.. మాకు నచ్చినట్లుగా చేసుకుంటాం… అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయి.. అంతా మా ఇష్టం అన్నట్లుగా కోడి పందేల నిర్వాహకులు వ్యవహరించారు.. పందేలపై ఆంక్షలు ఉన్న క్షేత్రస్థాయిలో అవి బుట్ట దాఖలు కావడం దారుణం.. సంక్రాంతి పండుగ వేళ కోడిపుంజుల పందాలు జోరుగా సాగాయి.. ఈ పందాల విషయంలో భారీగా నోట్ల కట్టలు చేతులు మారినట్లు ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నుంచి సుమారు మూడు నాలుగు కిలోమీటర్ల అవతల ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఏలేరు నడి సెంటర్లో కోడి పందాలు జోరుగా సాగాయి. ఈనెల 14వ తేదీన భోగి పండుగ సందర్భంగా ప్రారంభమైన కోడి పందాల సమరం మంగళవారం వరకు కొనసాగింది. మూడు రోజులపాటు జరిగిన కోడిపందాల ఫైట్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. కోడిపందాలు నిర్వహించవద్దని ఆంక్షలు ఉన్నప్పటికీ కొందరు నిర్వాహకులు రాజకీయ అండదండలతో పందెం పోటీలు నిర్వహించినట్లు ముమ్మర ప్రచారం జరిగింది. అనుమతులు లేకుండా కోడిపందాలు జరగడం వెనక పలు అనుమానాలు కలుగుతున్నాయి. కోడి పందేల గుడారాల వద్ద ఎలాంటి నిఘా నేత్రాలు లేకపోవడం గమనార్హం. ఇటు కోడిపందాలతో పాటుగా అటు వివిధ రకాల జూద మాటలు సాగడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత బహిరంగంగా జరుగుతున్నప్పటికీ పోలీసు వారు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
కోడి పందాల జూదంలో తెలంగాణ వారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలేరు ఊర్లో జరిగిన కోడిపందాల జూదంలో తెలంగాణ వారు సైతం పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు పెద్ద పెద్ద కోడిపుంజులను పట్టుకొని కోడిపందెంలో దిగి సంబరం చేసుకున్నారు. ఈ పోటీల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ప్రచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కోడిపందాల జూదం జరగడం విమర్శలకు ఎక్కింది.
భారీగా ట్రాఫిక్ జామ్ ప్రయాణికులు ఇబ్బందులు..
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల సమీపంలో ఏలేరు ఊర్లో మూడు రోజుల పాటు కోడి పందాలు జరిగాయి. ఈ పందేలకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం నుండి ద్విచక్ర కార్లపై భారీగా తరలి రావడంతో ఇబ్బందికర వాతావరణ ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపుదల చేయడం పోటీల అనంతరం తిరిగి ప్రయాణమయే సమయంలో భారీగా ట్రాప్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ సందర్భంగా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇరువర్గాల మధ్య ఘర్షణ..
సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం జరిగిన కోడిపందాల గుడారాల వద్ద కొందరి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దూసుకువెళ్లడంతో అక్కడ ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పొరపాటున ప్రాణాలు పోతే ఏంటని ఆ ప్రాంతంలోని కొంతమంది తీవ్రస్థాయిలో చర్చించుకున్నారు. భారీ ఎత్తున జాతర జరిగినట్టుగా జరిగిన కోడిపందాల పోరు వద్ద నిఘానేత్రం లేకపోవడం విమర్శలకు దారి తీయడంతో పాటుగా చర్చనీయాంశంగా మారింది.
