తెలంగాణ వీణ , హైదరాబాద్ : త్వరలో కొలువుదీరనున్న అయోధ్య రాముడికి మన హైదరాబాద్ నగరం అపురూపమైన కానుకలు అందిస్తున్నది. రామ మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకొనేలా చేయడంలో మన శిల్పులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అయోధ్య రామాలయానికి 118 దర్వాజలు హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకొంటుండగా.. ఆ నీలమేఘశ్యాముడికి రెండు జతల బంగారు పాదుకలు కూడా అందబోతున్నాయి. సీతారామ చంద్రుడికి సుమారు రూ.1.03 కోట్ల విలువైన బంగారం పాదుకలను నగరానికి చెందిన అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ అందిస్తున్నది. ఇప్పటికే ఒక జత పాదుకలను భక్తులు పాదయాత్రగా తీసుకెళ్తున్నారు. మరో జత నేడు(సోమవారం) ఉదయం విమానంలో బయలుదేరబోతున్నాయని ఫౌండేషన్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి తెలిపారు. వెండిపైన బంగారు తాపడంతో 13 కేజీల బరువుతో రూపొందించిన ఈ రెండో జత పాదుకలను పాత బోయిన్‌పల్లిలోని హస్మత్‌పేటలో ఉన్న శ్రీశ్రీశ్రీ మద్విరాట్ కళాకుటీర్‌లో తయారు చేశారు. 25 రోజుల పాటు శ్రమించి శిల్పులు వీటిని ఎంతో వైవిధ్యంగా రూపొందించారు. ఈ నెల 10-15 మధ్యలో ఈ రెండు జతల పాదుకలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్‌కు అందివ్వనున్నారు.
ఫౌండేషన్ సాయంతో నగరానికి చెందిన రామ భక్తుడు చల్లా శ్రీనివాస్ శాస్త్రి ఈ పాదుకలను తయారు చేయించారు. ముందు తయారీ పూర్తైన మొదటి జత పాదుకలకు అతను దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అన్ని పుణ్యక్షేత్రాల్లో పూజలు జరిపించారు. అక్టోబర్ 28న కాకినాడలోని వెదరుపాకం నుంచి ఆ పాదుకలతో పాదయాత్రగా బయలుదేరారు. అలా దేశవ్యాప్తంగా భక్తులకు దర్శనార్థంగా ఉంచారు. రామేశ్వరం, శృంగేరి, కంచి, తిరుమల, శ్రీరంగ, సింహాచలం, విజయవాడ సహా అనేక పుణ్యక్షేత్రాలు, మఠాల్లో ఆ పాదుకలు పూజలు అందుకున్నాయి. రాముడు ఎలాగైతే పాదయాత్రగా అరణ్య వాసం నుంచి తిరిగి అయోధ్యకు బయలుదేరాడో అదేవిధంగా ఈ పాదుకలను చేర్చబోతుండటం విశేషం. కాగా, రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యలో ఘనంగా ఏర్పాటు సాగుతున్నాయి. గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే బాలరాముడి విగ్రహాన్ని ఇప్పటికే ఎంపి చేసినట్టు సమాచారం. జనవరి 22న విగ్రహాన్ని ప్రతిష్ఠించన్నారు. వారం పాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగనున్నాయి.
నా జీవితానికి సార్థకత లభించింది
నేను సినిమాల్లో సౌండ్ ఇంజినీర్‌గా పనిచేశాను. రాముడికి సేవ చేయడంలోనే నాకు నిజమైన సంతృప్తి దొరికింది. రామ మందిర నిర్మాణం ప్రారంభం నుంచే నేను నా పూర్తి సమయం రాముడికే అంకితమిచ్చాను. నేను అయోధ్యలో రాముడి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మందిరానికి కిలోమీటర్ దూరంలో ఉచితంగా సుమారు 10 వేల మందికి అన్నదానం అందించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నాను. మన తెలంగాణ వంటకాలు అక్కడ ఉంటాయి. భక్తులు ఎవరైనా నా నంబర్ 9550754389కు ఫోన్ చేసి సంప్రదించొచ్చు.
– చల్లా శ్రీనివాస్ శాస్త్రి, రాముడి పాదుకల దాత