తెలంగాణవీణ , నేరేడుచర్ల : సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు ఎంత ప్రధానమో గాలి పటాలు కూడా అంతే. ఈ పండుగ సమయాల్లో గాలి పటాలు ఎగురవేస్తూ ఆనందించడం రివాజు. పట్టణ ప్రాంతాల్లో గాలి పటాలు ఎగురవేసే సంస్కృతి కొద్దిమేర తగ్గినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అధికంగా ఉన్నది. గాలి పటం ఎగురవేసే సమయంలో ధ్యాసంతా దానిపైనే ఉంటుంది. ఈ సమయంలో గోడలు, మిద్దెలు, ఎత్తైన భవనాలు, మైదానాల నుంచి ఎగురవేస్తూ ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉంటాం. విద్యుత్ తీగలకు చుట్టుకున్న గాలి పటాలను తొలగించే ప్రయత్నంలోనూ విద్యుదాఘాతానికి గురైన సంఘటనలూ చోటు చేసుకునే ప్రమాదం ఉన్నది.
ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గాలి పటాలు ఎగురవేయడంలో ఆనందం ఉంటుంది. దీంతోపాటు అజాగ్రత్తగా ఉంటే ఎనలేని దుఃఖం దరిచేరుతుంది. గాలి పటాలు ఎగురవేసే సమయంలో వేళ్లకు ప్లాస్టర్ వంటివి చుట్టుకోవాలి. దీని వల్ల మాంజా పూసిన దారం వల్ల చేతివేళ్లు తెగకుండా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం అయితే గాయాన్ని శుభ్రంగా కడగాలి. రక్తస్రావం ఆగేందుకు బ్యాండేజీతో కట్టేసి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా గాలి పటాలను ఇతరులకు ఇబ్బంది లేకుండా మైదాన ప్రాంతాల్లో ఎగురవేయడమే మేలు.