తెలంగాణవీణ, బోధన్ : సంక్రాంతి వచ్చిందంటే పతంగులు, పిండివంటలే కాదు కోడి పందేలు కూడా గుర్తుకొస్తాయి. అయితే, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ సంస్కృతి మన జిల్లాలోనూ అక్కడక్కడ కనిపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో గుట్టుగా నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా ‘బరి’లోకి దిగేందుకు పందెంరాయుళ్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే బోధన్ డివిజన్‌లో కోడిపందాలు ప్రారంభమయ్యాయి. ఇక, సోమవారం రోజున సంక్రాంతి పండుగ ఉన్నందున శనివారం నుంచి కోడి పందాలు జోరందుకునే అవకాశం ఉందని, పండుత తర్వాత కూడా వారం రోజులపాటు ఈ జోరు కొనసాగే అవకాశముంటుంది జిల్లాకు ఎన్నో దశాబ్దాల కిందట వ్యవసాయం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల నుంచి వేలాది కుటుంబాలు వలస వచ్చి స్థిరపడ్డారు. వారితో పాటు కోడిపందాల సంస్కృతి కూడా ఇక్కడికి వ్యాప్తి చెందింది. సంక్రాంతి సందర్భంగానే ఈ జూదం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జోరుగా జరుగుతుంది. అంతేతప్ప ఈ కోడి పందేలు ఉభయ గోదావరి జిల్లాల్లో మాదిరిగా ఊరూరా జరిగే ఆనవాయితీ మన దగ్గర లేదు. దశాబ్దాల క్రితం వలసవచ్చినవారు స్థిరనివాసాలను ఏర్పాటుచేసుకున్న కాలనీలను ‘క్యాంప్‌లు’ అని పిలుస్తుంటారు. ఈ క్యాంప్‌ల శివార్లలోనే గతంలో కోడి పందేలు జరిగేవి. క్యాంప్‌ల శివార్లకు గుట్టలు తోడయితే.. పందెంరాయుళ్లు అక్కడ రహస్య స్థావరాలు ఏర్పాటుచేసి కోడి పందాల బరులు ఏర్పాటుచేస్తుంటారు. క్యాంప్‌లకు దూరంగా ఉండే కొన్ని గుట్టలు కూడా రహస్యంగా కోడి పందాల నిర్వహణకు స్థావరాలుగా మారాయి. ఏటా జిల్లాలోని గోదావరి, మంజీర పరీవాహక ప్రాంతంలోని కొన్నిచోట్ల కోడి పందాలు జరుగుతున్నాయి. అటు వర్ని, కోటగిరి, రుద్రూర్, ఎడపల్లి మండలాల్లోనూ, ఇటు నందిపేట్, నవీపేట్, మాక్లూర్, డిచ్‌పల్లి మండలాల్లోనూ కోడి పందాల జోరు కనిపిస్తుంటుంది. వర్ని మండలంలోని హూమ్నాపూర్ గుట్టలు, రుద్రూర్ మండంలోని రాయకూర్ గుట్టలు, నందిపేట్ మండలంలోని సెటిలర్స్ క్యాంప్‌లకు సమీపంలోని కొన్ని ప్రాంతాలు, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లోని సలీం ఫారం, పోచారం గుట్టలు గతంలో ఈ పందాలకు స్థావరాలుగా ఉండేవి. జిల్లాలోని సత్యనారాయణపురం, హూమ్నాపూర్, పెంటాఖుర్దు, ధర్మారం తదితర గ్రామాలు కూడా గతంలో కోడి పందాలకు నిలయాలుగా ఉండేవి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కోడి పందేల నిర్వాహకులు స్థావరాలను మార్చుతున్నారు. రహస్య స్థావరాలుగా రానున్న వారం రోజులపాటు భారీగా కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ జరిగే కోడి పందేల్లో లక్షలు చేతులు మారుతాయని చెబుతారు.