తెలంగాణ వీణ , క్రీడలు : భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్2023 లీగ్ దశలో శ్రీలంకపై మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పేసర్ మహ్మద్ షమీ 5 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో 5వ వికెట్ తీసిన తర్వాత షమీ గ్రౌండ్‌లో మోకరిళ్లాడు. దీనిపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. షమీ మైదానంలో ప్రార్థన (సజ్దా) చేశాడంటూ కొందరు, ధైర్యంగా ప్రార్థన చేయలేక పోయాడంటూ పాకిస్థాన్‌కు చెందిన నెటిజన్లు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని బుధవారం ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించగా షమీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. తాను ఒక ముస్లింగా, భారతీయుడిగా గర్వపడుతున్నానని పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. తాను భారతీయ ముస్లింనని, ప్రార్థన చేయాలనుకుంటే ఎవరు ఆపుతారని చెప్పాడు. తాను వేరే మతం వారిని ఆపబోనని, వారు తనను ఆపబోరని, ప్రార్థన చేయాల్సి వస్తే చేస్తానని, ఇందులో సమస్య ఏమిటని షమీ ప్రశ్నించాడు. తనకు ఏదైనా సమస్య ఉంటే ఇండియాలో నివసించను కదా అని చెప్పాడు. ప్రార్థన చేయడానికి అనుమతి తీసుకోవాల్సి వస్తే తాను ఇక్కడెందుకు ఉంటానని గట్టి కౌంటర్ ఇచ్చాడు.