తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘నో కామెంట్’ అంటూ వెళ్లిపోయారు. సీఎం ఎంపిక విషయంపై అధిష్ఠానంతో చర్చించేందుకు సోమవారం సాయంత్రమే భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం పలువురు సీనియర్ లీడర్లను కలిసినట్లు సమాచారం. కర్ణాటక ఉపముఖ్యమంత్రి, తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్ తో ఉత్తమ్ మధ్యాహ్నం భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై దాదాపు గంటన్నర పాటు ఇద్దరూ చర్చించారు. మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. దీంతో ఉత్తమ్ క్లుప్తంగా మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను హైకమాండ్ కు వివరించినట్లు చెప్పారు. సీఎం ఎంపిక బాధ్యత హైకమాండ్ దేనని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.