తెలంగాణ వీణ , సిటీబ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్ర యాణ పథకాన్ని అమలుచేస్తే ఆటో కార్మికుల బతుకుదెరువు ఎలా? అని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌పోర్ట్ ఆధారిత వాహనాలపై ఆధారపడి బతుకుబండిని లాగుతున్న డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని వాపోయారు. కాంగ్రెస్ ఆటో రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయడమో లేదా ఆటో కార్మికుల బతుకు దెరువుకు భరోసానివ్వడమో చేయాలని విన్నవించారు. అందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. సమావేశంలో యూనియన్ ముఖ్య నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు.