తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ముగియనుంది. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (60) ను సాధించిన నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మాణిక్ రావ్ ఠాక్రేలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
“2009లో డిసెంబరు 3న శ్రీకాంతాచారి అమరుడయ్యాడు. ఇవాళ డిసెంబరు 3… 2023. నేడు తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పుతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా, శ్రీకాంతాచారి ఆత్మ బలిదానానికి ఘనమైన నివాళి ఇచ్చారు. మలి తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించి, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని రాష్ట్ర కాంగ్రెస నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.
ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా మాలో స్ఫూర్తిని నింపారు, మాలో విశ్వాసాన్ని కలిగించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలంగాణతో ఉన్నది రాజకీయ అనుబంధం కాదు… కుటుంబ పరమైన అనుబంధం. ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులమే.
ఈసారి గతంలో జరిగినట్టుగా ఉండదు… సచివాలయ గేట్లు సామాన్యుడికి కూడా తెరుచుకుని ఉంటాయి. ప్రగతి భవన్ ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుతుంది. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు… ప్రజా భవన్… అది ప్రజల ఆస్తి. దాన్ని ప్రజల కోసమే వినియోగిస్తాం. 2004 నుంచి 2104 వరకు దేశంలో కాంగ్రెస్ ఎలాంటి స్ఫూర్తిదాయక పాలన ఇచ్చిందో, అదే ప్రేరణతో తెలంగాణలోనూ పరిపాలిస్తాం” అని రేవంత్ రెడ్డి వివరించారు.