తెలంగాణ వీణ , జాతీయం : పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా భారీ మొత్తంలో నల్లధనం బయటపడడంపై ఓ ఎంపీ అప్పట్లో ఆశ్చర్యపోయారు.. అంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఎలా పోగేస్తారో అంటూ 2022 లో ట్వీట్ చేశాడు. కట్ చేస్తే.. ఇప్పుడు అదే ఎంపీ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒకటి.. రెండు కాదు.. ఐదు రోజుల పాటు 50 మంది బ్యాంకు సిబ్బంది, 20 కౌంటింగ్ మెషిన్లతో లెక్కించినా ఇంకా పూర్తికాలేదు. దీంతో సదరు ఎంపీని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. బీజేపీ ఐటీ సెల్ నేషనల్ కన్వీనర్ అమిత్ మాలవీయ ఆ ఎంపీని ఏకంగా కరప్షన్ డాన్ అని ట్వీట్ చేశారు. ఆయన బలే కామెడీ చేస్తాడని అంటూ వ్యగ్యంగా ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ ఎంపీ మరెవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ ఝార్ఖండ్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు.
ఝార్ఖండ్ కు చెందిన లిక్కర్ బిజినెస్ మ్యాన్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు నివాసం, ఆఫీసులలో ఐటీ శాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారంతో చేసిన ఈ దాడులతో దేశంలో ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో చూడనంత సొమ్ము బయటపడింది. ఎక్కడ చూసినా నోట్ల కట్టల గుట్టలే కనిపించాయి. వందలాది బ్యాగుల్లో అన్నీ రూ.500 నోట్లే ఉన్నాయి. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు బ్యాంకు సిబ్బందిని పిలిపించి, కౌంటింగ్ మెషిన్లతో లెక్కించడం ప్రారంభించారు. ఐదు రోజులుగా లెక్కింపు జరుగుతున్నా ఇప్పటికీ పూర్తికాలేదు.