తెలంగాణ వీణ , హైదరాబాద్ : అధికారం చేతులు మారినప్పుడు దానికి సంబంధించిన పలు పరిణామాలు వరుస పెట్టి సాగిపోతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణలో నెలకొంది. కేసీఆర్ సర్కారు హయాంలో నియమించిన పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు ఊడిపోయాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడి.. కాంగ్రెస్ గెలిచినంతనే పలువురునేతలు గౌరవప్రదంగా తమకున్న పదవులకు రాజీనామాలు చేసేసి తప్పుకున్నారు. మరికొందరు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. తాజాగా మొత్తం 54 మంది కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు ఊడబీకేసిన వైనం ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎక్కువ మంది రేవంత్ సర్కారు కొలువు తీరినప్పుడు.. తమ పదవులకు కాలం చెల్లినట్లుగా డిసైడ్ అయి ఉన్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలుగా పోటీచేసేందుకు టికెట్లు ఇవ్వలేని వారిని.. ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయని వారిని.. ఇతర పదవులు ఇవ్వటానికి కుదరని నేతలకు వివిధ సంస్థల కార్పొరేషన్లకు ఛైర్మన్ పదవిని కట్టబెట్టటం తెలిసిందే. ముఖ్యనేతలకు సన్నిహితంగా ఉండే వారికి ఈ పదవుల పందేరం సాగుతూ ఉంటుంది.