తెలంగాణ వీణ ,హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఉపముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగ పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరాయే వెన్నెముక అని చెప్పారు. వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా, రవాణ, సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్తే మొత్తంగా చూస్తే, ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండడం రాష్ట్ర మనుగడకు చాలా అవసరమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి టీఎస్‌జెన్‌కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లుగా ఉందని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటుకన్నా చాలా ముందుగానే తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు, పనులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తరువాతి కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ముఖ్యంగా, రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఇక్కడి స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యానికి అదనంగా 1800 మెగావాట్ల విద్యుత్ వచ్చే విధంగా కూడా అప్పటి తమ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను చట్టంలో రూపొందించందన్నారు.
‘రాష్ట్రం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తిచేసినది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మాత్రమే. అది కూడా పూర్తికావడానికి సుదీర్ఘ కాలం పట్టింది. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగిపోయింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఇది బొగ్గు గనులకు అత్యంత దూరంగా నిర్మితమవుతున్నది. ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే సంవత్సరానికి రూ.800 కోట్లు. ప్రాజెక్టు జీవితకాలం 30 ఏండ్లు అనుకుంటే, ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతున్నది.