తెలంగాణ వీణ , క్రీడలు : చీలమండ గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం వాకింగ్ స్టిక్స్ సాయంతో నడుస్తున్నాడు. కాలిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సూర్య షేర్ చేశాడు. గాయమైన ఎడమ కాలి చీలమండపై ఒత్తిడిని తగ్గించడానికి ఎడమ చేత్తో వాకింగ్ స్టిక్ పట్టుకొని నడుస్తున్నట్టు వీడియోలో కనిపించింది. ‘‘కొంచెం సీరియస్ విషయమే. గాయాలు ఎప్పటికీ సరదా కావు. అయినా సరే నేను ముందుకు నడుస్తాను. తక్కువ సమయంలో పూర్తి ఫిట్‌గా వెనక్కి తిరిగొస్తానని మాట ఇస్తున్నాను!. అప్పటి వరకు మీరంతా హాలిడే సీజన్ ఎంజాయ్ చేస్తారని, ప్రతిరోజూ చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’’ అనే క్యాప్షన్ ఇచ్చిన సూర్య వీడియోను షేర్ చేశాడు. ఎడమ కాలి చీలమండపై మెడికల్ కట్లు కనిపించాయి. కాగా డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 3వ టీ20 మ్యాచ్‌లో సూర్యకు చీలమండ గాయమైంది.