- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- కొత్తగూడెం సింగరేణి డిపార్ట్మెంట్లో ఎన్నికల ప్రచారం
తెలంగాణ వీణ , భద్రాద్రి : ఇందిరమ్మ రాజ్యంలో సింగరేణికి శ్రీరామరక్ష అని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
సింగరేణిలో గుర్తింపు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న
ఐ ఎన్ టి యు సి యూనియన్ తరపున సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ మైన్స్ డిపార్ట్మెంట్లలో మంత్రి పొంగులేటి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడియారం గుర్తు పై ఓటు వేసి ఐఎన్టీయూసీ యూనియన్ ను గెలిపించాలని అభ్యర్థించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. ఈ గుర్తింపు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న
ఐ ఎన్ టి యు సి ని సైతం గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికులు చూపించిన ఆధార అభిమానులతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో కార్మికుల జీవితాలు బాగుపడతాయని స్పష్టం చేశారు.
అధికారంలో లేని పార్టీ మాయమాటలు చెప్పి కార్మికులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని కార్మికులు దీన్ని గమనించాలని వారి వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఐఎన్టీయూసీ గెలుపుతో
సింగరేణి కార్మికులకు 250 గజాల స్థలము, 20 లక్షల వడ్డీ లేని రుణం కల్పిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సింగరేణిలో కార్మికుల పేరు మార్పిడి చేయలేదు మన ప్రభుత్వంలో కచ్చితంగా సాధించుకుందాం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కారుణ్య నియామకాలలో దళారులు 4 లక్షల నుండి 10 లక్షల వరకు లంచం తీసుకునే దౌర్భాగ్యం నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ దళారికి ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదన్నారు. విద్యా వైద్యం కోసం సింగరేణి సంస్థతోపాటు ప్రభుత్వం అన్ని విధాలుగా కార్మికుల పక్షాన ఉంటుందన్నారు.
ఇన్ కం టాక్స్ అలవెన్స్ వాటిపై విధించే వడ్డీలను యాజమాన్యమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టాలని ఆ విధంగా కేంద్రంలో సింగరేణి సంస్థకు చేయాల్సిన విధివిధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 23వ తేదీన సింగరేణి దినోత్సవ సందర్భంగా సెలవును రోజుగా ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త భూగర్భ గానులను ప్రారంభించుకునేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.
విద్యావంతులైన కార్మికులకు తమకు సూటబుల్ అయిన ఉద్యోగాలు మహిళా కార్మికులకు అనువైన ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ దిశగా చేపట్టే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రైవేటీకరణ ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సింగరేణి సంస్థలో 60 వేల కార్మికులు ఉండేవారన్నారు. 2023 వరకు 39,250 ఉద్యోగస్తులకు చేరిందన్నారు. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు జీతాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఎన్నికల గుర్తు గోడగడియారం గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ కార్మిక సంఘాల నుండి వచ్చిన కార్మికులకు ఐఎన్టీయూసీ సంఘం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.