తెలంగాణ వీణ , సినిమా : మూడు పదులు దాటితే చాలు కొందరి ముఖంలోనే వారి వయసు కనబడిపోతుంటుంది. కానీ నయనతార, త్రిష వంటి అతి కొద్దిమంది హీరోయిన్లు మాత్రం తమ అందంతో వయసును దాచేస్తారు. ఆ కోవలోకి హీరోయిన్ వేదిక చేరతారు. ఇంకా చెప్పాలంటే వారి కంటే కూడా చాలా స్లిమ్‌గా యవ్వనంగా కనిపిస్తారు. ఈమె వయసు మూడున్నర పదులు అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంత నాజుగ్గా కనిపించే వేదికకు తనకంటూ పెద్ద అభిమాన గణమే ఉన్నారు. ఈమె మోడలింగ్ రంగం నుంచి వచ్చి కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేశారు.అలా ఈ బ్యూటీ పలు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈమె మదరాసి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత బాల దర్శకత్వం వహించిన పరదేశి చిత్రంలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా సిద్ధార్ధ్ కు జంటగా కావ్య తలైవన్, రాఘవ లారెన్స్ సరసన ముని కాంచన– 3 వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తన సత్తా చాటుకున్నారు.
కాగా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, భాషల్లోనూ నటిస్తూ బహు భాషా నటిగా రాణిస్తున్న వేదిక ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటిలో రెండు తెలుగు, రెండు తమిళం, రెండు మలయాళం, ఒక కన్నడ చిత్రాలు ఉండటం విశేషం. చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న వేదిక, నటనకు అవకాశం ఉన్న కథా చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. అందుకే నేటికీ ఈమె కథానాయికగా కొనసాగుతున్నారని చెప్పవచ్చు.