- పథకాల దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం
- దరఖాస్తు నింపుటకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు
- దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్ కార్డు జత చేయాలి
- భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
తెలంగాణ వీణ , కొత్తగూడెం : ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న గ్రామ వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించుటకు షెడ్యూల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.
మంగళవారం ఖమ్మం ఐడిఓసి కార్యాలయంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ వార్డు సభల నిర్వహణపై పంచాయతీ రాజ్ నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు మున్సిపల్ కమిషనర్లు తహసిల్దార్లు ఎంపిడివోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు.
ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాల్టీలలో టీములు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. 27వ తేదీ వరకు అన్ని గృహాలకు ప్రజాపాలన దరఖాస్తులు అందచేయాలని చెప్పారు. లబ్ధిదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దరఖాస్తు నింపుటకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని చెప్పారు. కౌంటర్లులో మహిళలకు వయోవృద్దులకు దివ్యాంగులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ప్రజలకు పరిపాలన చేరువ చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా నిర్వహించాలని చెప్పారు.
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 31, జనవరి 1 ప్రభుత్వ సెలవులు మినహాయించి అన్ని కార్యాలయ పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలం పరిధిలో తహసిల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల చొప్పున ఉదయం 8 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టు లల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. ప్రజాపాలన సభలలో పాల్గొనే సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. మహాలక్ష్మి రైతు భరోసా చేయూత గృహ జ్యోతి ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రతి గ్రామానికి దరఖాస్తులు ఒకరోజు ముందుగానే అందచేయాలని గ్రామ ప్రజలకు ముందుగానే దరఖాస్తులు అందించాలని దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామంలోని నిరక్షరాస్యులకు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు స్వయం సహాయక మెప్మా సంఘాల సహకారాన్ని తీసుకోవాలని చెప్పారు.
గ్రామసభల నిర్వహణకు సంబంధించి ముందస్తు తయారు చేసిన షెడ్యూలు ప్రకారం సమయపాలన పాటిస్తూ నిర్వహించాలని చెప్పారు. ప్రజాపాలన నిర్వహణపై మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపల్ వార్డులో ప్రజా పాలన సభ ఎప్పుడు నిర్వహిస్తున్నామనేది ప్రజలకు ముందస్తుగా తెలియజేసేందుకు టామ్ టామ్ లు వేయించాలని చెప్పారు. ప్రజాపాలన సభ నిర్వహణకు అవసరమైన మౌళిక సదుపాయాలు త్రాగునీరు కుర్చీలు అవసరమైన బల్లలు షామియానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు. దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్ కార్డు జత చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం 27వ తేదీన ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు విడుదల చేస్తుందని వెంటనే మండలాలకు పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జెడ్పీ సీఈఓను ఆదేశించారు. ప్రతిరోజు ప్రజాపాలన సభలలో తీసుకునే దరఖాస్తులను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయాలని దరఖాస్తుదారునికి రసీదు అందించాలని ప్రజాపాలన సభ నిర్వహణకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని వారిని భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ మున్సిపల్ వార్డులో ప్రజాపాలన సభల నిర్వహణకు ఇంచార్జిలను ఏర్పాటు చేయాలని గ్రామ సభలలో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలి కౌంటర్లలో ఎవరు విధులు నిర్వహించాలని మొదలు కొని ప్రతి అంశం ప్రణాళిక బద్ధంగా జరిగేలా చూడాలని చెప్పారు. సిబ్బందికి ముందస్తుగానే విధులు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
దరఖాస్తులు ఇచ్చే కౌంటర్ల వద్ద బందోబస్తు…
ఎస్పి డాక్టర్ వినీత్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో డిఎస్పి, మున్సిపల్ స్థాయిలో సీఐ, గ్రామస్థాయిలో ఎస్ ఐ బందోబస్తు విధులను పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. దరఖాస్తులు ఇచ్చుటలో కౌంటర్లు వద్ద రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు.
రద్దీ ఉంటే ముందస్తుగా టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. క్రమ పద్దతి పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి…
స్థానిక సంస్థల అదనపుకలెక్టర్ జే.అరుణశ్రీ మాట్లాడుతూ మహాలక్ష్మి రైతు భరోసా చేయూత గృహ జ్యోతి ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని దరఖాస్తుదారులు ముందస్తుగా దరఖాస్తు ఫారం నింపుకొని గ్రామ సభకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామసభ నిర్వహణపై డప్పు చాటింపు ద్వారా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజాపాలన గ్రామసభ నిర్వహించే ప్రదేశం సమయం వివరాలు ముందస్తుగా ప్రచారం చేయాలని చెప్పారు.
గ్రామసభ నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతిక్ జైన్, ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు, మధుసూదన్ రాజు, జడ్పి సీఈవో విద్యాలత, డిపిఓ రమాకాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, అన్ని మండలాల తహసిల్దారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.