తెలంగాణ వీణ , సినిమా : తన దేశంలో తనకు రక్షణ లేకుండా పోయిందంటోంది పాకిస్తాన్ నటి ఆయేషా ఒమర్. తనతో పాటు ఆ దేశంలో ఉన్న మహిళలందరికీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలే కరువైపోయాయంటోంది. తాజాగా ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఇక్కడ సేఫ్‌గా అనిపించడం లేదు. కాసేపు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి బయటకు వెళ్లాలనిపిస్తుంది సరదాగా సైకిల్ తొక్కాలనిపిస్తుంది. వాకింగ్ చేయాలనీ ఉంటుంది. కానీ ఏదీ చేయలేకపోతున్నాను. కరాచీ అంత సురక్షితమైన ప్రదేశం కాదనిపిస్తోంది. ఇక్కడ నాకు ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతోంది. బహుశా చాలామంది మహిళల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉండొచ్చు. పాకిస్తాన్ మహిళలు ఎంత ఇబ్బందిపడుతున్నారో మగవాళ్లు ఎంత ప్రయత్నించినా అస్సలు అర్థం చేసుకోలేరు. ఆడవాళ్ల భయాందోళనలు వారికి ఎన్నటికీ అర్థం కావు. ఇక్కడివాళ్లు ప్రతి క్షణం భయపడుతూ నరకం చస్తున్నారు. నాపై రెండుసార్లు దాడి జరిగింది. ఎప్పుడు, ఎవరు.. ఎటు నుంచి వచ్చి కిడ్నాప్ చేస్తారో, దాడి చేస్తారో, అత్యాచారం చేస్తారోనని చాలా భయంగా ఉంది. ప్రతి మనిషికి స్వేచ్ఛ, రక్షణ తప్పనిసరిగా అవసరం. కానీ ఆ రెండు ఇక్కడ దొరకట్లేదు.