తెలంగాణ వీణ , రాష్ట్రీయం : నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశిగా పిలిచే ఈ రోజున కోట్లమంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహావిష్ణువును పూజిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతేకాదు, ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ఈ తెల్లవారుజామున 1.45 గంటలకే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్ఎల్ భట్టి, జస్టిస్ శ్యాంసుందర్, జస్టిస్ తారాలా రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, ఉష, శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామకృష్ణం రాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, టీడీపీ నేతల అచ్చన్నాయుడు వంటి ప్రముఖులు తిరుమల తరలివచ్చారు.