తెలంగాణ వీణ , జాతీయం : గత ఐదేళ్లలో విదేశాల్లో 403 మంది భారత విద్యార్థులు చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో కెనడా వెళ్లినవారే ఎక్కువ మంది ఉన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు కెనడా వెళ్లిన 91 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల మరణించారు. యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)కు వెళ్లిన 48 మంది విద్యార్థులు చనిపోయారు.
ఈ వివరాలను కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహజ మరణాలతో పాటు యాక్సిడెంట్లు, ఆరోగ్య పరమైన సమస్యలతో స్టూడెంట్లు మృతిచెందుతున్నట్లు తెలిపింది. అయితే వీటిలో కొన్ని అనుమానాస్పద మరణాలున్నట్లు పేర్కొంది.
విదేశాల్లోని భారత విద్యార్థుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని కేంద్రమంత్రి మురళీధరన్ చెప్పారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగి విదేశాల్లో విద్యార్థులు మరణిస్తే వాటిపై ఆయా దేశాల అధికారులతో ఫాలోఅప్ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల మృతికి కారణమైన వారికి సరైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.