తెలంగాణ వీణ, శామీర్ పేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. శనివారం జిల్లాలోని శామీర్పేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకంలో భాగంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో రూ.5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రస్తుతం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కార్పొరేట్ స్థాయి ఆసుపత్రుల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించడం జరుగుతుందని కలెక్టర్ గౌతమ్ వివరించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకంకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆరోగ్య కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలెక్టర్ గౌతమ్ జెండా ఊపి ప్రారంభించి అదే బస్సు లో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డితో కలిసి ప్రయాణించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మహిళలకు వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్బస్సులలో రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. దీంతో పాటు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జీరో చార్జీ టికెట్ అందించడం జరుగుతుందని.. ఇది మహిళా సాధికారతకు దోహదపడడంతో పాటు ఆర్టీసి బస్సులో ప్రయాణం వల్ల మహిళలకు రక్షణ ఉంటుందని కలెక్టర్ గౌతమ్ అన్నారు. ప్రతి మహిళా ఆర్టీసి బస్సులో ప్రయాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.