తెలంగాణ వీణ ,హైదరాబాద్ : హైదరాబాద్‌లో తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆసుపత్రి మొత్తం బూడిదకుప్పలా మారింది. తాజాగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో సులేమాన్‌నగర్ ఎంఎం పహాడీలోని ఓ కట్టెల గోడౌన్‌లో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణానికీ అంటుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలకుతోడు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. మరోవైపు, స్థానికులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.