తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని చూసినప్పుడు.. తమకు అలవాటైన విభజించి.. పాలించే విధానాన్ని విజయవంతంగా మరోసారి అమలు చేశారు కేటీఆర్. తమ వాదనకు అనుకూలంగా ఎవరినైనా తెచ్చుకునే అలవాటు కేసీఆర్ లో కనిపిస్తుంది. ఆయన కొడుకుగా కేటీఆర్ అదే వ్యూహాన్ని మరింత పక్కాగా అమలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న వేళలో.. సీనియర్ నేత జానారెడ్డి.. విలువలకు నిలువెత్తు రూపంగా నిలిచే జైపాల్ రెడ్డి లాంటి వారిని ఉద్దేశించి ఎంత చులకనగా.. మరెంత సంస్కారహీనంగా మాట్లాడారో తెలియంది కాదు. ఉద్యమ సమయంలో జైపాల్ రెడ్డి గురించి ఆకాశానికి ఎత్తేసిన కేసీఆర్.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నంగా ఆయనపై ఎన్ని అవాకులు చవాకులు పేలారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రికి తగ్గట్లే తనయుడు కేటీఆర్ సైతం తక్కువ తినలేదు. ఈ రోజున విపక్షంలో ఉండి విలువల గురించి మాట్లాడే ఆయన.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఏకవచనంలో.. ఇష్టారాజ్యంగా మాట్లాడిన వైనాన్ని మర్చిపోకూడదు. అలాంటి కేటీఆర్ నోటి నుంచి మర్యాద గురించి వచ్చిన మాటల్ని చూస్తే.. మాటలు నేర్చినమ్మ ఏమైనా మాట్లాడుతుందన్న సామెత గుర్తుకు రాక మానదు.