తెలంగాణ వీణ , హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ కోసం గట్టిగా కొట్లాడిన వర్గాల్లో జర్నలిస్టులు కూడా ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా చిన్న,మధ్యశ్రేణి మీడియాలవారే ముందు వరుసలో ఎక్కువగా ఉన్నారన్నది కాదనలేని సత్యం.పెద్ద మీడియాల్లో పనిచేసే జర్నలిస్టులు యాజమాన్యాల వైఖరికి భిన్నంగా పోయే అవకాశం ఉండదు.అందుకే లోపల ప్రత్యేక తెలంగాణ కావాలనే కాంక్ష బలంగా ఉన్నా ముందుపడలేకపోయారు.అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశించిన పాత్రికేయ వర్గాలకు మొండిచేయే ఎదురైంది.కొందరు జర్నలిస్టు సంఘాల పేరిట మాత్రం పదవులు,ఫలితాలు అనుభవించారు.మరికొందరు పైరవీలు,దందాలు చేసి బాగుపడ్డారు.ఇక అన్యాయమైంది సగటు పాత్రికేయుడే.అటు అక్రిడేషన్ అనే నిబంధన చూపెట్టి ప్రభుత్వ పథకాలకు వీరిని దూరం చేశారు.బీఆర్‌ఎస్ పాలనలో పైరవీలు చేసే కొందరు జర్నలిస్టు సంఘాల నేతలు మాత్రమే లబ్ధి పొందగలిగారు.మిగతా మెజార్టీ పాత్రికేయ లోకానికి శూన్యమే మిగిలింది.ఇదంతా ఒక ఎత్తయితే గడిచిన బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పాత్రికేయుల ప్రతిష్ఠను ఆ పార్టీ నేతలు పథకం ప్రకారం దిగజార్చారు.అడ్డుతగిలిన జర్నలిస్టులపై అక్రమకేసులతో అణగదొక్కారు.అక్రిడేషన్ అనే చిత్తు కాగితాన్ని జర్నలిజం డాక్టరేట్ పట్టాలాగా చూపెట్టి అక్రిడేషన్లను అంగడి సరుకుగా మార్చారు.మొత్తం పాత్రికేయ లోకాన్నే అక్రిడేషన్ అనే కంచెతో బంధించాలని చూశారు. కొందరు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులులైతే హద్దులు దాటి పాత్రికేయులపై దుర్భాషలాడటంతోపాటు కొన్ని చోట్ల భౌతిక దాడులకు పాల్పడ్డారు.కేవలం వెయ్యి రూపాయలు డిమాండ్ చేశారంటూ దారిదోపిడీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జర్నలిస్టులను జైళ్లకు పంపించిన ఉదంతాలున్నాయి.ఉత్తర తెలంగాణలో కొందరు బీఆర్‌ఎస్ శాసనసభ్యులు కేటీఆర్ అండదండలతో పాత్రికేయులపై అనేక అరాచకాలకు పాల్పడ్డారు.ఇలా చెప్పుకుంటూపోతే అనేక ఆగడాలు..అవమానాలు..ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ పతనాన్ని ప్రతీ పాత్రికేయుడు కోరుకోవాల్సి వచ్చింది.జర్నలిస్టులంతా కోరుకున్నట్లుగా గడిచిన ఎన్నికల్లో కారు బోల్తాపడి పాలన హస్తగతమైంది.అయితే జర్నలిస్టుల సమస్య ఇంతటితో తీరిపోయిందనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? అనే ప్రశ్న మొదలయింది.గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ఫోర్త్ ఎస్టేట్ ప్రతిష్ఠను కాంగ్రెస్ పార్టీ కాపాడగలుగుతుందా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.అయితే బీఆర్‌ఎస్ ప్రతిష్ఠను సర్వనాశనం చేసిన కొందరు దళారీ పాత్రికేయ ముఠా నాయకులే మళ్లీ కండువాలు మార్చి కాంగ్రెస్ పంచన చేరుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వారితోనే గడిచిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తుక్కుతుక్కుగా ఓడిపోయింది.మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మళ్లీ అదే పోకడతో ఇక్కడ కూడా పాత్రికేయులకు అన్యాయం చేసే ఎత్తుగడ వేస్తున్నట్లుగా సమాచారం ఉన్నది.మరికొందరు తమ వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని తమకే ఈ ప్రభత్వ హయాంలో పదవులు వస్తాయంటూ అప్పుడే దందాలు షురూ చేసినట్లుగా వినికిడి.అలాగే కొన్ని కార్పోరేట్ మీడియాలైతే సీఎం రేవంత్ రెడ్డి తమకు అనుకూలుడనే సంకేతాలు ఇస్తూ అప్పుడే తమ పనులను కానిచ్చుకోవాలనే తలంపులో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇలా ఎవరికి వారు తమ పబ్బం గడుపుకోవాలని కాచుకుని ఉన్నారు.ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం జరిగేనా? అనే అనుమానంలో సామాన్య జర్నలిస్టులు ఉన్నారు.అయితే పార్టీ పత్రికలు,కార్పోరేట్ మీడియాల్లో ఇమడలేక చాలామంది సీనియర్ పాత్రికేయులు సొంతంగా వివిధ రకాల మీడియాలను ఏర్పాటు చేసుకుని ప్రజాక్షేత్రంలో ఉన్నారు.అలాంటివారికి కేవలం అక్రిడేషన్ అనే నిబంధన చూపెట్టి ఇండ్ల జాగలు అందకుండా చేయడం తగదు.అలాగే రాష్ట్రవ్యాప్తంగా మండల విలేకర్లు ప్రజాక్షేత్రంలో ఉన్నారు.అలాంటివారికి కూడా ఇప్పటివరకూ ఇండ్ల జాగలు అందలేదు.అక్రిడేషన్ ఉంటేనే అన్నీ అన్నట్లుగా వ్యవహరిస్తే అక్రిడేషన్ అంగడి సరుకుగా మారింది. రూ.30 నుంచి 40 వేల రూపాయలు వెచ్చించి చాలామంది నాన్ జర్నలిస్టులు అక్రిడేషన్లు కొనుగోలు చేసి జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారు.వీరు ఏనాడు అక్షరాలు రాయరు.ప్రజల్లో ఉండరు.కేవలం అక్రిడేషన్ ఉన్నది కావున అన్ని సౌకర్యాలకు వారు అర్హులంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు.అలాగే మరికొందరు మూడు నాలుగు చోట్ల ఇండ్ల జాగలు దక్కించుకోగలిగారు.అందుకే అక్రిడేషన్ అనేది ప్రభుత్వ పథకాలకు కొలమానంగా చూడరాదని అంటారు.కేవలం సీనియారిటీ, సంస్థ ఇచ్చే ఐడీ కార్డులను ప్రామాణికంగా తీసుకుని నిజమైన పాత్రికేయులకు ఎలాంటి వివక్ష చూపెట్టకుండా అన్ని ప్రభుత్వ పథకాలను అందచేయాలి.ఇందుకోసం ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయాల్సి ఉన్నది.ఈ కమిటీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతోపాటు సీనియర్ పాత్రికేయులకు చోటు కల్పించి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉన్నది.జర్నలిస్టులుగా ప్రభుత్వ గుర్తింపు దక్కాలంటే ఏది కొలమాణంగా ఉండాలనే విషయం మీద ఈ కమిటీ అధ్యయనం చేయాల్సి ఉన్నది.అలాగే అనివార్యమైన డిజిటల్ మీడియాని ప్రభుత్వం గుర్తించడానికి ఏ ఏ ప్రమాణాలను పాటించాలి? డిజిటల్ మీడియాల ఏర్పాటునకు ఉండాల్సిన నియమ నిబంధనలు ఏంటి? ఎవరు డిజిటల్ మీడియా జర్నలిస్టులు ? ఎవరు సోషల్ మీడియా కార్యకర్తలు? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉన్నది.నిజమైన పాత్రికేయం బతికి బట్టకట్టాలంటే ఏ చర్యలు తీసుకోవాలి? జర్నలిస్టులకు స్వీయ నియంత్రణ ఏమేర ఉండాలి? ఏది జర్నలిజం? ఏది యెల్లో జర్నలిజం? ఇలా అనేక సందేహాలకు సమాధానం వెతికి పాత్రికేయ ప్రతిష్ఠను మళ్లీ నెలకొల్పడానికి కొత్త ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.అప్పుడే జర్నలిస్టుల సమస్యల పరిష్కాం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది.అలాకాకుండా కొందరు లాబీయిస్టులు,కార్పోరేట్ మీడియాల వలలో చిక్కుకుని గడిచిన ప్రభుత్వ పోకడలోనే పోతామంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పట్టక మానదు.పదేండ్లలో కేసీఆర్ ఎంత వ్యతిరేకత తెచ్చుకున్నారో రేవంత్ రెడ్డి కేవలం నాలుగు నెలల్లోనే అంతకన్నా వ్యతిరేకత మూటగట్టుకుంటారు.ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే
అక్రిడేషన్ చిత్తు కాగితమే..కొలమానం కారాదు
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం
జనవరి నెలలో భారీ సభను నిర్వహిస్తాం
డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ గౌరవాధ్యక్షుడు పి.విశ్వనాథ్
రాష్ట్రంలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందే..అన్ని ప్రభుత్వ పథకాలు అందాల్సిందే..ఈ క్రమంలో ఎలాంటి వివక్ష, చిన్న పెద్ద అనే తారతమ్యం ఉండరాదు.అక్రిడేషన్ అనేది చిత్తు కాగితమే.దాన్ని అడ్డుపెట్టి జర్నలిస్టులకు అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుని జర్నలిస్టుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి.గత ప్రభుత్వ హయాంలో పాత్రికేయుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీ వేసి అధ్యయనం చేయాలి. రాష్ట్రంలో ఉన్న పాత్రికేయ సంఘాలు, మెజార్టీ జర్నలిస్టుల అభిప్రాయలను తీసుకున్న తర్వాతనే మీడియా అకాడమీ ఛైర్మెన్‌ను నియమించాలి.ఎవరో కార్పోరేట్ పత్రిక అధిపతులు చెప్పారని పదవులు ఇస్తే మళ్లీ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరుగుతుంది.కాంగ్రెస్ ప్రభుత్వం మీద పాత్రికేయులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి మీద ఉన్నది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం డిజెఎఫ్ పక్షాన అలుపెరగని పోరాటం చేస్తాం.జనవరి నెలలో భారీ సభను నిర్వహించి ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలను మరొకసారి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తాం.