- దరఖాస్తుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలి
- గ్రామ సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఆరు పథకాలు ప్రతి పేదవాడికి గ్యారంటీగా అందించాలని కొత్తగూడెం శాశనసభ్యులు కూనంనేని సాంబశివరావు అధికారులకు సూచించారు. చుంచుపల్లి మండలం ఎన్ కే నగర్ బాదావత్ తండా గ్రామ పంచాయతీలో గురువారం జరిగిన ప్రజాపాలన గ్రామ సభకు అయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలుచేస్తున్న మహాలక్ష్మి రైతు భరోసా గృహ జ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయూత పథకాలతో పేదల స్థితిగతులు మారతాయని అన్నారు. పథకాల అమలులో ఎలాంటి పైరవీలకు తావుండబోదని ప్రజలు నేరుగా అధికారులను సంప్రదించి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఆరు రోజులపాటు జరిగే గ్రామ వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమకు కావాల్సిన పథకాన్ని దరఖాస్తు రూపంలో అధికారులకు అందించాలని కోరారు. అభయ హస్తం దరఖాస్తుల కొరత లేకుండా అధికారులు చర్యను చేపట్టాలని ప్రతి ఇంటికి దరఖాస్తు చేరేవిదంగా తగిన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. స్వీకరించిన దరఖాస్తులపై త్వరితగతిన విచారణ పూర్తిచేసి పథకాలు అమలు చేయాలనీ కోరారు. సర్పంచ్ సుగుణ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో జెడ్పి సీఈవో విద్యాలత, ఎమ్మార్వో కృష్ణ, ఎంపివో సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, చుంచుపల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.