నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం
తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు పాల్గొంటారు. రాష్ట్రంలో అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అలాగే నాలుగు కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మొదటిది జనవరి నుంచి వృద్ధాప్య పెన్షన్ ను రూ. 3000లకు పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుఫాన్ పంట నష్టంతోపాటూ వాటి పరిహారానికి సంబంధించిన అంశంపై మంత్రుల అభిప్రాయాలను సేకరించనున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ వైద్య చికిత్స పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వీటన్నింటితో పాటూ పలు సంస్థలకు ప్రభుత్వ భూమిని కేటాయించే విషయంలో మంత్రుల ఆమోదం తెలుపనున్నారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వృద్ధులకు రూ. 3000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి దీని అమలును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రతి ఏడాది రూ. 250 పెంచుకూంటూ పోతామని చెప్పింది. అందులో భాగంగానే 2024 జనవరి 1 నుంచి అవ్వాతాతలతో పాటు వితంతు, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. వీరికి ప్రతినెలా ఇచ్చే పింఛను మొత్తాన్ని రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచుతూ కేబినేట్ ఆమోదముద్ర వేయనుంది.
అలాగే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందుతున్న వారికి మరింత లబ్ధి చేకూరేలా గతంలో ఉన్న పరిమితిని పెంచాలని నిర్ణయించింది. ప్రతి పేదోడు అనారోగ్యంతో ప్రాణాలు పోగొట్టుకోకూడదనే లక్ష్యంతో రూ. 25లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటూ మిచౌంగ్ తుఫాన్ బాధితులను ఆదుకోవడం, రైతుల పంట నష్టంపై అంచానా వేసి వారికి తగు ఆర్థిక సాయాన్ని అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.