తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఓడలు బండ్లు అవుతాయి… బండ్లు ఓడలు అవుతాయి! ఈ నానుడి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి అతికినట్టు సరిపోతుంది. ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లి, రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారగా… ఆ తర్వాత ఎంపీగా గెలిచి, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని విజయపంథాలో నడిపిస్తుండడం రేవంత్ రెడ్డికే చెల్లింది. తదుపరి సీఎం కూడా ఆయనే అంటున్నారు!
కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఘనవిజయం అందుకున్నారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని వినమ్రంగా పేర్కొన్నారు. కొన ఊపిరి ఉన్నంతవరకు కొడంగల్ నియోజకవర్గమే శ్వాసగా జీవిస్తానని స్పష్టం చేశారు. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని భావోద్వేగపూరితమైన హామీ ఇచ్చారు.