తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తిరుపతిలోని మంగళం సమీపంలో వున్న పీఎ్‌సఎన్ గార్డెన్స్ వద్ద వాగులో మంగళవారం మధ్యాహ్నం గల్లంతైన నిఖిల్(11) మృతదేహం లభ్యమైంది. మంగళంలోని కేబీఆర్ నగర్ వద్ద వర్షపునీటి ప్రవాహంలో జీవకోనకు చెందిన నిఖిల్ కొట్టుకుపోగా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టాలని తహసీల్దారు వెంకటరమణ భావించారు. అయితే గురువారం ఉదయం 7.15 గంటలకు గల్లంతైన ప్రాంతం నుంచి 150 మీటర్ల దూరంలోనే మృతదేహం లభించింది. వాగులో చెట్టుకు తగులుకుని ఉన్న మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు దహనక్రియలు పూర్తయ్యాయి.