తెలంగాణ వీణ , హైదరాబాద్ : నాసిరకం మందులను తెప్పించి వాటికి ప్రముఖ కంపెనీల లేబుళ్లను వేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. నిందితుల ఇళ్లు, గోడౌన్ లలో తనిఖీలు చేసి లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ ఏరియాలలో శుక్రవారం ఈ దాడులు చేశారు. ఈ దందా నిర్వహిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి మీడియాకు వివరించారు. నిందితులు ఉత్తరాఖండ్ నుంచి నకిలీ మందులను నగరానికి తెప్పిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ గ్యాంగ్ కార్యకలాపాలకు సంబంధించి పక్కా సమాచారం అందడంతో రెయిడ్స్ నిర్వహించామని వివరించారు. దీంతో రూ.26 లక్షల విలువైన మందులు దొరికాయని తెలిపారు. నగరంలోని దిల్ సుఖ్ నగర్ కు చెందిన పువ్వాడ లక్ష్మణ్, సైదాబాద్ కు చెందిన పోకల రమేశ్, గర్లపల్లి పూర్ణచందర్ లు మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నారు. శివగంగా థియేటర్ దగ్గర్లో పువ్వాడ లక్ష్మణ్ కు గోడౌన్ ఉంది. ఈ ముగ్గురూ కలిసి నగరంలోని వివిధ మెడికల్ షాపులకు మందులు సప్లై చేస్తున్నారు. ఉత్తరాఖండ్ కాశీపూర్ నుంచి నకిలీ మందులను కొరియర్ లో తెప్పించి, వాటికి సన్ ఫార్మా, గ్లిన్ మార్క్, అరిస్టో ఫార్మా, టొరెంటో ఫార్మా.. తదితర ప్రముఖ బాండ్ల లేబుళ్లను అతికిస్తున్నారు. ఆపై వాటిని మందుల దుకాణాలకు చేరుస్తున్నారు.