తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కుట్ర అని.. ప్రజలను మభ్యపెట్టడంలో ఆ పార్టీ ముందు ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఆ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని విమర్శించారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత సోమవారం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని డీఎంకే నేత హేళన చేసినపుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఇండియా కూటమిలో డీఎంకే కూడా ఉందని గుర్తుచేసిన కవిత.. కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై మౌనాన్ని ఆశ్రయించడాన్ని ప్రశ్నించారు. దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ.. తమ మిత్రపక్షం నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పట్టనట్టు ఉంటున్నారని కవిత విమర్శించారు.