తెలంగాణ వీణ , హైదరాబాద్ : పల్లె వెలుగు బస్సులో ఓ కండక్టర్ ఇద్దరు మహిళా ప్యాసింజర్లకు డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ సంఘటనపై ఆదివారం సాయంత్రం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ నుంచి బోధన్‌కు వస్తున్న పల్లె వెలుగు బస్సులో పలువురు ప్రయాణికులు ఎక్కారు. అందులో ఓ ప్రయాణికుడు ముగ్గురికి టికెట్లు కావాలని డబ్బులు ఇచ్చాడు. కండక్టర్ నర్సింలు ముగ్గురికి టికెట్ పంచ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి మహిళలకు ఫ్రీ కదా.. మూడు టికెట్లు ఎలా ఇస్తావని కండక్టర్‌ను నిలదీశాడు. ‘మహిళా ప్యాసింజర్లు ఉన్నట్టు నాకు ఎలా తెలుస్తది.. మీరే ఆ విషయాన్ని చెప్పి టికెట్లు తీసుకోవాలి’ అని కండక్టర్ చెప్పారు.
డబ్బులు వాపసు ఇస్తానని కండక్టర్ చెప్పినా.. తమకు డబ్బులు వాపసు ఎలా చేస్తావు? మహిళలకు టికెట్లు తీసుకోవద్దని తెలియదా? అని సదరు ప్రయాణికుడు వాదించడంతో ఇద్దరి మధ్య స్వల్ప వివాదం జరిగింది. ఈ ఘటనను వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్ అయ్యింది.