తెలంగాణ వీణ ,హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో జరగనున్న కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ భేటీకి పార్టీ హైకమాండ్ తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు, ఎంపీ సీట్ల కేటాయింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.