ఘనంగా సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ వీణ , కాప్రా: దేశంలో విభజన రాజకీయాలను సమర్థిస్తూ, ప్రజల మధ్య మత విద్వేషాలను పెంచి పోషిస్తున్న బీజేపీని ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఎస్. బోస్ పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఐ కాప్రా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ ముందు ఏర్పాటు చేసిన జెండాను సీపీఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి ఎగురవేశారు. అదేవిధంగా ఈసీఐఎల్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఎర్రజెండాను సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. శంకర్ రావు ఎగురవేశారు.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలను నిర్మించి విజయం సాధించి వాటి ప్రతిఫలాలను ప్రజలకు అందించడంలో సీపీఐ ఎనలేని కృషి చేసిందని అన్నారు.సీపీఐ పార్టీ నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు నిర్వహించిన ఘన చరిత్ర ఉన్నదని వారు ఉద్ఘటించారు.కానీ దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం విభజన రాజకీయాల చేస్తూ విపక్ష రాజకీయాల హక్కులను కాలరాస్తున్నాడని ధ్వజమెత్తారు.మోడీ ప్రభుత్వ విధానాలంతా కార్పొరేట్ అనుకూల విధానాలేనని విమర్శించారు. అందుకే కార్పొరేట్ సంస్థలు అంబానీ, ఆదానీ లకు 150లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిన నీచ ప్రధానిగా నరేంద్రమోదీ చరిత్ర పుటల్లో ఉంటారని విమర్శించారు. ఇదే రాయితీలు దేశ ప్రజలకు ఇస్తే దేశ ప్రగతి మారేదని అన్నారు. మోడీకి దేశ ప్రజలపై ప్రేమ లేదని, కేవలం దేశాన్ని దోచుకునే సంస్ధలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు.దేశంలో చిన్న తరహా పరిశ్రమలకు సహాయం చేయని కారణంగా వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని,వాటి కారణంగానే దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని విమర్శించారు. అందుకే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని దేశ ప్రజలంతా ఇంటికి పంపే పనిలో నిమగ్నమయ్యారని స్పష్టంచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఇంటికి పంపినట్లే దేశంలో బీజేపీకి ఘోరీ ఖాయమని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి , సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. శంకర్ రావు,ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, సీపీఐ కాప్రా పట్టణ కార్యదర్శి జీ. లక్ష్మీ నారాయణ, సీపీఐ ఉప్పల్ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు నర్సింహా,నేతలు అశోక్, క్లైమేట్ తదితరులు పాల్గొన్నారు.