తెలంగాణ వీణ , జాతీయం : గాలి కాలుష్యం వల్ల ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఖనిజ ఇంధనాలకు బదులుగా పరిశుద్ధమైన, పునరుద్ధరణీయ ఇంధనాలను వాడితే ఈ ముప్పును తప్పించవచ్చునని తాజా అధ్యయనం వెల్లడించింది. మన దేశంలో గాలి కాలుష్యం వల్ల ఏటా 21.80 లక్షల మంది మరణిస్తున్నారని, ఈ విషయంలో చైనా తర్వాతి స్థానం మనదేనని తెలిపింది.
పరిశ్రమలు, విద్యుదుత్పత్తి, రవాణా రంగాల్లో శిలాజ ఇంధనాల వాడకం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా అదనంగా 51 లక్షల మంది మరణిస్తున్నట్లు తెలిపింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం వల్ల 83 లక్షల మంది మరణించినట్లు అంచనా. మృతుల్లో 30 శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో, 16 శాతం మంది గుండె పోటుతో, 16 శాతం మంది కాలేయ వ్యాధులతో, 6 శాతం మంది మధుమేహంతో మరణించినట్లు పరిశోధకులు తెలిపారు.