తెలంగాణ వీణ , రాష్ట్రీయం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుస్సాహం చేసిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై దండయాత్ర చేసి 13 గేట్లను అక్రమించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని విమర్శించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో శ్రీశైలం, తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో నాగార్జున సాగర్ ఉండాలన్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా సాగర్‌ను దురాక్రమించడం సరికాదని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యనికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెండు రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణానికి విఘాతం కలిగేలా ఉందని చెప్పారు. కుడి కాలువకు నీటి విడుదల ఆపాలని కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశించిందన్నారు. అయినా నీటి విడుదల కొనసాగుతున్నదని, పోలీసులు వెనక్కి వెళ్లలేదని తెలిపారు. రాష్ట్రాల పరిధిలో వుండే హక్కులను కేంద్రం చేతుల్లోకి పోయేలా ఆంధ్ర ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు.