తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుపాను మరో రెండు గంటల్లో తీరాన్ని దాటబోతోంది. ఇప్పటికే తాపాను తీరాన్ని సమీపించింది. ప్రస్తుతం ఈ పెను తుపాను దక్షిణ కోస్తా తీరం వైపు ఉత్తర దిశగా కదులుతోంది. మరో మూడు, నాలుగు గంటల్లో తుపాను బాపట్ల వద్ద తీరాన్ని దాటనుంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇప్పటికే దట్టమైన మేఘాలు సగభాగం భూ ఉపరితలం మీదకు వచ్చేశాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటిన తర్వాత వర్ష తీవ్రత మరింత పెరగనుంది. తుపాను ప్రస్తుతం కావలికి 40 కిలోమీటర్లు, బాపట్లకు 40 కిలోమీటర్లు, నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుపాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది.