తెలంగాణ వీణ , జాతీయం : ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజాలో అభం శుభం ఎరగని రోజుల పసికందులు ప్రాణాలు కోల్పోతున్నారు. నెలలు నిండక ముందే భూమ్మీద పడిన పాపాయిలను ఇంక్యూబేటర్లో ఉంచాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో ఇంక్యూబేటర్లు పనిచేయడంలేదని గాజాలోని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో పసికందులకు వెచ్చదనం కోసం ఒకేచోట పక్కపక్కనే పడుకోబెడుతున్నట్లు వివరించారు. ఆదివారం తమ ఆసుపత్రిలో 39 మంది పసికందులు ఉండగా.. సాయంత్రానికి ముగ్గురు చనిపోయారని ఓ డాక్టర్ చెప్పారు. సోమవారం 36 మంది ఉన్నారని, వీరిలో రేపు ఎంతమంది మిగులుతారోనని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ఆసుపత్రిలో బెడ్ చుట్టూ ఫాయిల్ చుట్టి అందులో పసికందులను పడుకోబెడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ఆ బెడ్ పక్కనే వేడి నీళ్ల పాత్రలు పెట్టి వారికి వెచ్చదనం లభించేలా చూస్తున్నామని తెలిపారు. గాజాలోని అతిపెద్ద ఆసుపత్రిలో కనీస సౌకర్యలు కొరవడ్డాయి. ఓవైపు మందులకు తీవ్ర కొరత ఏర్పడగా.. తాజాగా ఇంధనంలేక విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.