తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీసీ సీఎం చేస్తామన్న బీజేపీ ప్రకటనను రాహుల్ గాంధీ చులకన చేస్తున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీసీ వర్గాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పెత్తందార్ల మనస్తత్వంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలున్నారు.. ఆ పార్టీలను తెలంగాణ బీసీలు ఓటుతో తిప్పికొట్టాలన్నారు.
బీజేపీ బీసీల అభిమానాన్ని చూరగొంది. అధికార పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తోంది. బీసీల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న ఎన్నికలు ఇవి. కొండంత ఆశతో బీసీలు మోదీ వైపు చూస్తున్నారు. డిపాజిట్లు గల్లంతైన పార్టీ కాంగ్రెస్. నిన్నటి సభలో రాహుల్ బీసీలను అవమానిస్తారా?. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్. తక్షణమే రాహుల్ బీసీలకు క్షమాపణ చెప్పాలి. బీసీలంటే రాహుల్‌కు ఎందుకంత చులకనా?. బీసీల పట్ల కాంగ్రెస్ విపరీత ధోరణి మారాలి. ఎక్కడ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి. దేశ ప్రజలంతా ప్రధాని మోదీ వైపు చూస్తున్నారు’’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.