తెలంగాణ వీణ, భక్తి : శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు.. వేదానికి సమానమైన శాస్త్రం.. గంగతో సమానమైన తీర్థం లేదు.. అలాగే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని స్కంధ పురాణంలో పేర్కొనబడింది. అన్ని మాసాల్లో కెల్లా కార్తీకమాసం చాలా విశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఈ మాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ కాలంలో వీరిద్దరిని పూజించడం వల్ల అనేక పుణ్యాలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులుచెపుతున్నారు .అయితే కార్తీక మాసాన్ని ఎలా ఆచరించాలి..? ఈ కాలంలో ఎలాంటి పనులు చేయకూడదు..?అయితే కార్తీక మాసంలో శివకేశవులిద్దరిని సమానంగా ఆచరించి కొన్ని పద్ధతులు పాటించాలని అంటున్నారు. అంతేకాకుండా కార్తీకమాసంలో నదీన్నానం ఎంతో ప్రాముఖ్యమైనదని అంటున్నారు.
కార్తీక మాసంలో ఉపవాసం ఉండాలనుకునేవారు కొన్ని నియమాలు పాటించాలి. సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలి. ఒకపూట మాత్రమే భోజనం చేయాలి. అదీ శాఖాహారాన్నే తినాలి. నిత్యం ఆరాధ్యించే దేవునిపై మనసును ఉంచాలి. నేలపైనే నిద్రించాలి. దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. ఇక నదీస్నానాలు చేయడం మంచిది. నదులు దూరం ఉన్నవాళ్లు వారానికి ఒకసారైనా వెళ్లడం మంచిది. నదీస్నానం పూర్తయిన తరువాత నదుల్లో దీపాలు వదలాలి. ఇక ఈ మాసాన్ని పాటించేవారు. మాంసాహారం జోలికి పోకూడదు. మంచంపై నిద్రించకూడదు. ఒకపూట మాత్రమే భోజనం చేయాలి. ఇతరుల మనసును నొప్పించకూడదు. నిత్యం పూజలపైనే దృష్టి సారించాలి.
కార్తీక మాసం శివుడు, విష్ణువులిద్దరికి ఇష్టమే. అందువల్ల శైవ, విష్ణువు ఆలయాలు ఈ కాలంలో దైవనామస్మరణతో మారుమోగుతాయి. వీలైనప్పుడల్లా ఈ ఆలయాలను సందర్శించాలి. విష్ణువుకు తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిస పువ్వు , గరిక, దర్బలను సమర్పించాలి. శివుడికి బిల్వ దళాలు, జిల్లేడు పూలను ఇవ్వాలి. అర్చకులకు ఒక పాత్రలో బియ్యం, ఉసిరికాయ వంటి వస్తువులతో కూడిన దీపాన్ని దానం ఇవ్వాలి. ఈ మాసంలో సోమవారం ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటున్నారు.